Sunday, January 25, 2009

బొప్పాయి పులుసు


పల్లెల్లో బొప్పాయిచెట్టు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. పోషక విలువల పరంగా చూసినా బొప్పాయి కాయది అగ్రస్థానమే. అయితే పండిన తరవాతే ఎక్కువమంది వాటిని వినియోగిస్తారు. కానీ పచ్చి కాయలతో కూడా రకరకాల రుచికరమైన కూరల్ని తయారుచేసుకోవచ్చు...
కావలసినవి
కొద్దిగా పండిన బొప్పాయి: సగం ముక్క, మునక్కాయ: ఒకటి,
బెండకాయలు: మూడు,
బచ్చలి ఆకులు: ఎనిమిది,
కొత్తిమీర: ఒక కట్ట,
పచ్చిమిర్చి: నాలుగు,
బెల్లం: నిమ్మకాయంత,
చింతపండురసం: రెండు కప్పులు,
ఉప్పు: తగినంత,
పసుపు: చిటికెడు,
బియ్యప్పిండి లేదా సెనగపిండి: రెండు స్పూన్లు,
పోపుకోసం:
ఆవాలు: ఒక స్పూను,
మెంతులు: అరస్పూను,
ఎండుమిర్చి: రెండు,
నూనె: రెండు స్పూన్లు.
తయారుచేసేవిధానం
బొప్పాయి చెక్కు తీసి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి. బెండకాయలు, మునగకాయ కూడా ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి ఆకు సన్నగా కోయాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఓ గిన్నెలో వేసి ముక్కలు మునిగేవరకూ నీళ్లు పోసి ఉప్పు, పసుపు కూడా వేసి కొద్దిగా ఉడికించాలి. తరవాత చింతపండు రసం, బెల్లం వేసి మరికాసేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత అరకప్పు నీళ్లలో సెనగపిండిని ఉండలు కట్టకుండా కలిపి పులుసులో వేయాలి. పిండి వేసిన తరవాత ఐదు నిమిషాలు ఉడికించి దించి కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. ఇప్పుడు పులుసును తాలింపు వేస్తే సరి!

No comments:

Post a Comment