Sunday, January 25, 2009

కోడికూర విజయవాడ ప్రాంతంవాలది

నాన్‌వెజ్‌ ప్రియులకు కోడికూర అనగానే నోరూరుతుంది. ఎంత చికెన్‌ ప్రియులకైనా ఎప్పుడూ ఒకే రకమైన కూర తింటే మొహం మొత్తుతుంది. చిన్నపాటి మార్పులతో కోడికూరను రకరకాలుగా చేసుకుంటే పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తింటారు.అందుకే ఈవారం కొన్ని చికెన్‌ వంటకాలు...కావలసినవి
ఎముకలున్న బ్రాయిలర్‌ చికెన్‌: అరకేజీ, నీళ్లు: అరలీటరు, నూనె: 100గ్రా||, దేశవాళీ టొమాటో ముక్కలు: కప్పు, ఉల్లిపాయ తురుము: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, పెరుగు: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చికొబ్బరి ముద్ద: అరకప్పు, గసాల ముద్ద: అరకప్పు, అల్లంవెల్లుల్లిముద్ద: రెండు టీస్పూన్లు, ఆంధ్రా మసాలాపొడి: రెండు టీస్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: పావు టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చికెన్‌ బాగా కడిగి ఉప్పు, కారం, పెరుగు, పసుపు, మసాలాపొడి, సగం అల్లంవెల్లుల్లి ముద్ద ముక్కలకు బాగా పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.
కళాయిలో నూనె పోసి కాగిన తరవాత ఉల్లి తురుము వేసి దోరగా వేయించి మిగతా సగం అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత చికెన్‌ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి మరీ సన్నటి సెగ కాకుండా మీడియం సెగమీద ముక్కల్ని కలుపుతూ మగ్గనివ్వాలి. తరవాత సన్నగా చీరిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా వేసి కొద్దిగా ఎసరు పోసి ముక్కల్ని బాగా ఉడికించాలి. తరవాత పచ్చికొబ్బరి, గసాల ముద్దలు వేసి కొద్దిసేపు ఉడికించి చివరలో కొత్తిమీర చల్లి దించాలి.
ఇండియన్‌ సోరెల్‌
కావలసినవి
బ్రాయిలర్‌ చికెన్‌:అరకేజీ, నీళ్లు: అరలీటరు, చింతచిగురు: రెండు కప్పులు లేదా చింతచిగురు పొడి: కప్పు, ఉల్లి తురుము: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: రెండు టీస్పూన్లు, ఆంధ్రామసాలా పొడి: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, కొబ్బరిముద్ద: టీస్పూను, గసాలముద్ద: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: 100గ్రా||
తయారుచేసే విధానం
చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, మసాలాపొడి, కొబ్బరి, గసాలముద్ద, కొత్తిమీర తురుము అన్నింటినీ ముక్కలకు బాగా పట్టించాలి. కుక్కర్‌గిన్నెలో నూనె పోసి కాగిన తరవాత, ఉల్లితురుము, అల్లంవెల్లుల్లి వేసి దోరగా వేయించి చికెన్‌ మిశ్రమం కూడా వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. ముక్కలు కొద్దిగా ఉడికిన తరవాత సన్నగా చీరిన పచ్చిమిర్చి, చింతచిగురు వేసి నీళ్లుపోసి 15 నిమిషాలపాటు ఉడికించి దించాలి. చికెన్‌లో ఉండే ప్రోటీన్స్‌కు చింతచిగురు తోడయితే పుల్లపుల్లగా రుచికరంగా ఉండటంతోపాటు జీర్ణశక్తి బాగుంటుంది. ఎక్కువగా దొరికే కాలంలో చింతచిగురును శుభ్రంచేసి, రెండు రోజలు ఆరబెట్టి మూడోరోజు ఎండలోపెట్టి పొడి కొట్టి, ఉప్పు కలిపి నిల్వ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వంటల్లో వాడుకోవచ్చు.
ఆంధ్రా చికెన్‌
కావలసినవి
ఎముకల్లేని చికెన్‌ముక్కలు(మెత్తనివి): అరకేజీ, నీళ్లు: అరలీటరు, దేశవాళీ టొమాటో గుజ్జు: పెద్దకప్పు, ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌: పావు టీస్పూను, రిఫైండాయిల్‌: 100గ్రా||, ఉల్లిముద్ద: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెబ్బ, అల్లంవెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, కొబ్బరిముద్ద: టేబుల్‌స్పూను, గసాలముద్ద: టేబుల్‌స్పూన్‌, ఆంధ్రామసాలా పొడి: ఒక టేబుల్‌స్పూను, కారం: స్పూను, పసుపు: పావు టీస్పూను, మిరియాల పొడి: పావు టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చికెన్‌ముక్కల్ని శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు పట్టించి కాసేపు నాననిచ్చి,కుక్కర్‌లో కొద్దిగా నీళ్లుపోసి 15 నిమిషాలు ఉడికించాలి.
కళాయిలో నూనెపోసి సన్నగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసి వేరుగా ఉంచండి. అదే కళాయిలో ఉల్లిముద్ద దోరగా వేయించి మిగిలిన అల్లంవెల్లుల్లి కూడా వేసి వేయించాలి. మసాలాపొడి, ఉప్పు, కారం, కొబ్బరిముద్ద, గసాల ముద్ద, మిరియాలపొడి అన్నీ వేసి బాగా కలిపి టొమాటో గుజ్జు కూడా వేసి తిప్పాలి. చికెన్‌ముక్కలు, కొద్దిగా ఫుడ్‌ కలర్‌ వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. ముక్కలు వేగిన తరవాత కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి దించితే తక్కాలీ ఆంధ్రా చికెన్‌ రెడీ!

No comments:

Post a Comment